డబ్బాల తొలగింపులో ఉద్రిక్తత..బీఆర్‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు, అధికారుల మధ్య వాగ్వాదం

డబ్బాల తొలగింపులో ఉద్రిక్తత..బీఆర్‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు, అధికారుల మధ్య వాగ్వాదం

పరిగి, వెలుగు: పరిగి పట్టణంలోని మార్కెట్ సమీపంలోని డబ్బాల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, బీఆర్‌‌ఎస్‌‌ కౌన్సిలర్ల మధ్య ఆదివారం వాగ్వాదం జరిగింది. మార్కెట్ గేటు నిర్మాణానికి అడ్డుగా ఉన్న డబ్బాలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టగా స్థానికులు బీఆర్‌‌ఎస్‌‌ కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చారు.

కౌన్సిలర్ రవికుమార్, బీఆర్‌‌ఎస్‌‌ నాయకుడు శ్రీనివాస్ అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. డబ్బాల తొలగింపు వంటి విషయాలు ముందుగా మున్సిపల్ సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

కొన్నేళ్లుగా డబ్బాలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. మార్కెట్ గేటు నిర్మాణం కోసం నక్షా ప్రకారం అడ్డుగా ఉన్న డబ్బాలను తొలగిస్తున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డబ్బా యజమానులు, అధికారుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.